‘నీట్‌’ను వ్యతిరేకించడం సాధ్యమా...? ఏడాదికో విద్యార్థిని బలి గతేడాది అనిత... ఇప్పుడు ప్రతిభ దీన్నే ఆయుధంగా చేసుకున్న ప్రతిపక్షం స్టాలిన్‌ పిలుపుతో తెరపైకి కొత్త చర్చ



చెన్నై: గతేడాది కోర్టు తీర్పుతో చల్లబడిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) అంశం.. ప్రస్తుతం విద్యార్థిని ప్రతిభ బలవన్మరణం మళ్లీ నిప్పురాజేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించిన రాష్ట్రం విద్యార్థుల కోసం చేసిన ప్రయత్నాలన్నింటిని క్రమంగా పక్కనపెట్టింది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సబబేనని రాష్ట్రంలోనే కొందరు విద్యార్థులు గతంలోనే వ్యాఖ్యానించారు. అయితే ఈ క్రమంలో చోటుచేసుకున్న ఆందోళనలు, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక పోయానన్న ఆవేదనతో రాష్ట్రంలోని అరియలూరుకు చెందిన అనిత గత ఏడాది ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. వివిధ సంఘాలు, విద్యార్థులకు అండగా రాష్ట్ర సినీ పరిశ్రమకు చెందిన పలువురు రోడ్డుపైకి వచ్చి తమ మద్దతు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే దీన్నే ఆయుధంగా చేసుకుని ఆందోళనలు నిర్వహించింది. నీట్‌ నుంచి రాష్ట్రానికి మినహయింపు తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. సాక్షాత్తు శాసన సభలో కూడా ఈ విషయంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఏడాది తిరగ్గానే మళ్లీ నీట్‌ అంశంపై డీఎంకే, మిత్రపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈసారి మరో విద్యార్థిని ప్రతిభ  రూపంలో వారికి అవకాశం అందివచ్చింది. ఇదే అంశాన్ని శాసన సభలో లేవనెత్తుతూ సభ నుంచి వాకౌట్‌ చేసిన డీఎంకే ఇతర పక్షాలు అధికార పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించింది. భాజపా అధికారంలోలేని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకతాటిపైకి వచ్చి నీట్‌ను వ్యతిరేకించాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. దీంతో కొత్త చర్చ తెరపైకి వచ్చింది.
మినహాయింపునకు చర్యలు...
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) నుంచి రాష్ట్రానికి మినహాయింపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆది నుంచి ప్రయత్నాలు కొనసాగించాయి. చిన్న పార్టీలు సైతం ఈ అంశంపై జతకట్టాయి. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, వెంటనే నీట్‌ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వచ్చాయి. ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు, ఆందోళనలు కొనసాగుతూ వచ్చాయి. అధికార పార్టీ నీట్‌ నుంచి రాష్ట్రానికి మినహాయింపు కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేసింది. గతేడాది ఫిబ్రవరిలో రెండు బిల్లులను కూడా రాష్ట్ర శాసన సభలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించింది. అదేవిధంగా పలుమార్లు దేశ రాజధాని దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కేంద్రంలో ప్రధాని, ఇతర మంత్రులతో సమావేశమై నీట్‌ నుంచి మినహాయింపునకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఏడాది పాటు మినహింపునకు కేంద్రం సానుకూలంగా ఉందని ప్రకటించారు. అనంతరం సుప్రీం కోర్టు నుంచి వెలువడిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాల్సి వచ్చింది. ఆ సమయంలో రాష్ట్రానికి నీట్‌ నుంచి మినహాయింపు లభిస్తుందని ఎదురుచూసిన విద్యార్థులు చివరి క్షణంలో కోర్టు తీర్పుతో నిరుత్సాహపడాల్సి వచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తించిందని సర్దుకోవాల్సి వచ్చింది. నీట్‌ ఫలితాలను పరిగణలోకి తీసుకుని ప్రారంభించిన కౌన్సెలింగ్‌కు విద్యార్థులు హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. దీంతో ప్లస్‌టూలో అత్యుత్తమ మార్కులు సాధించిన వారు కొందరు నీట్‌లో ఆర్హత సాధించలేక అందోనకు గురయ్యారు. తన కల నెరవేరదని తెలిసి గత ఏడాది అనిత అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మరొకరు తనలా ఇబ్బంది పడుకూదని, ఆత్మహత్యకు పాల్పడి సమస్యను రాష్ట్రంలోపాటు దేశ వ్యాప్తం చేసింది. అప్పటి వరకు శాంతియుతంగా ఉన్న రాష్ట్రంలోని యువతను ఆమె మరణం తట్టిలేపింది. రాష్ట్రంలో విపక్షాలకు ఆ ఘటన ఒక అస్త్రం అయింది. ఏడాది గడిచే సరికి మరో విద్యార్థిని ప్రతిభ బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలచివేసింది. దీనిపై విపక్ష నేత స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలతో కొత్త చర్చ తెరపైకి వచ్చింది.
భాజపాయేతర పార్టీలు కలిసేనా...?
విద్యార్థిని ప్రతిభ ఆత్మహత్య అంశాన్ని శాసనసభలో ప్రస్తావించిన విపక్షనేత స్టాలిన్‌.. భాజపాయేతర పాలిత రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పుదుచ్చేరి, పశ్చిమబంగ ముఖ్యమంత్రులు నీట్‌ పరీక్షలను వ్యతిరేకించాలని ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో నీట్‌ ప్రశ్నపత్రాల్లో ప్రశ్నలు హిందీ వ్యతిరేక విద్యార్థులకు ఇబ్బంది కలిగేలా ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని ఓదార్చి, రూ.2 లక్షలు పార్టీ నిధిని అందజేశారు. ఈ సందర్భంగా ఎన్డీయే దేశంలో నీట్‌ను ప్రవేశపెట్టిందని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోందని దుయ్యబట్టారు. ప్రతిభ మరణంతోనైనా కేంద్రం కళ్లు తెరవాలని డిమాండు చేశారు. దీనిపై భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ స్పందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నీట్‌తో లబ్ధి కలుగుతుందని విస్తృత ప్రచారం కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. రజనీకాంత్‌ కూడా ఇలాంటి దయనీయమైన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ మాట్లాడుతూ ప్రతిభ మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహిస్తూ రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో నీట్‌ను వ్యతిరేకించడానికి భాజపాయేతర పాలిత రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలని, ఇందులో విద్యార్థుల ప్రయోజనం కన్నా రాజకీయ ప్రయోజనం ఎక్కువ ఉందని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు.

Comments

Popular posts from this blog

Current Affairs in Short: 11 June 2018